తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించిన ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అయితే.. పది రోజుల్లో మొదటి రెండు మూడు రోజులు.. చివరి రోజుల్లో భారీగా ప్రజలు తమ దరఖాస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజాపాలన గడువు ముగియగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కలిపి మొత్తంగా సుమారు కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ప్రజాపాలనలో మహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పది రోజుల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు.. ప్రత్యేక సాప్ట్వేర్లోకి అప్లోడ్ చేయనున్నారు. ఈ ప్రక్రియను ఈనెల 17న పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత.. ఆరు గ్యారెంటీల్లోని పథకాల లబ్దిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అయితే.. ఆధార్ కార్డులో మార్పుల వల్లనో.. లేదా స్థానికంగా అందుబాటులో లేకపోవటం వల్లో చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వలేకపోయారు. అయితే.. అలాంటి వాళ్లు.. తమకు పథకాలు వర్తించవేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Read Also..