ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నలోపం మాత్రం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రచారంలో ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజవర్గంలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. నేనంటే నేను అనే రీతిలో ఎవరికీ తోచిన విధంగా వారు ఢీ అంటే డీ అంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందన్నారు. రాబోయే కాలంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. భూపాలపల్లిలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న తనను ముచ్చటగా మూడోసారి గెలిపిచాలని గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ సర్కార్ మాటలు తప్ప చేసిందేమీ లేదన్నారు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని సత్యనారాయణరావు తెలిపారు. అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని రాష్ట్రంలో బిజెపికి అధికారం అప్పగిస్తే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మీ యొక్క ఆడబిడ్డగా నన్ను గెలిపిస్తే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తానని కీర్తి రెడ్డి తెలిపారు. మొత్తానికి ఎవరూ తోచిన విధంగా వారు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మరి ఓటరు మహాశయుడు ఎవర్ని కరుణిస్తాడో వేచి చూడాలి.
మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం
187
previous post