131
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారని ఆరోపించారు. కరీంనగర్ లోనూ సర్కార్ వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్ర జరుగుతోందన్నారు. కరీంనగర్ ప్రజలెవరూ మోసపోవద్దని, బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, డ్రగ్స్, కమీషన్ల దందాతో కరీంనగర్ అల్లాడుతున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేదవర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.