తెలంగాణ మంత్రి హరీశ్ రావు ములుగు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తుండగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే మీటింగ్ కు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడమేంటని నిలదీశారు. మంత్రి హరీశ్ రావు సభ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని చెప్పారు. బాధితులను కలిసిన ఎమ్మెల్యే సీతక్క.. అక్కడి నుంచే పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి అరెస్టులపై ప్రశ్నించారు. తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇచ్చే అవకాశం ఇవ్వరా? అంటూ నిలదీసిన సీతక్క.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్థాన్ లోనా? అని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలను కూడా పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.
ఇండ్లు కోల్పోయిన బాధితులు మంత్రిని కలిసేందుకు వీలులేకుండా పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ తమకు కావాల్సిన వారిని ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చి తీసుకొస్తున్నారని, సాధారణ ప్రజలను మాత్రం జైలులో పెడుతున్నారని విమర్శించారు. వారు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
105
previous post