ప్రపంచకప్ సమయంలో క్రికెట్ అభిమానుల మధ్య మాటల యుద్ధాలు సాధారణంగానే కనిపిస్తుంటాయి. ఈ విడత కూడా ఇలాంటివి కొన్ని చోటు చేసుకుంటున్నాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ట్విట్టర్ లో ట్వీట్ల పోరు కనిపించింది. ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల సంఘం ‘బార్మీ ఆర్మీ’ భారత క్రికెటర్ల పట్ల ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. మరోసారి బార్మీ ఆర్మీ తన అసలు రూపాన్ని చూపించింది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగగా, ఇంగ్లండ్ బౌలర్లు 229 పరుగులకు భారత్ ను కట్టడి చేశారు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ 2023లో ఇప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో మ్యాచ్ లో తేలిపోయాడు. సున్నా పరుగులకే డకౌట్ అయ్యాడు. దీన్ని బార్మీ ఆర్మీ ఎగతాళి చేసింది. నీటిలో ఉన్న రెండు డక్స్ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఒక బాతు తలకాయకు కోహ్లీ తలను తగిలించింది. మార్నింగ్ వాక్ కు వెళ్లిందంటూ క్యాప్షన్ పెట్టేసింది. దీనిపై భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఎడిట్ చేయడానికి మాకు కొంత సమయం ఇవ్వు’’అని బదులిచ్చింది. కోహ్లీ తల స్థానంలో బెన్ స్టోక్స్ తలను అతికించి ఇమేజ్ పోస్ట్ చేసింది. భారత బ్యాటింగ్ ముగిశాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైంది. భారత బౌలర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. కేవలం 129 పరుగులకే ఇంగ్లండ్ ను ఆల్ అవుట్ చేశారు. అప్పుడు ‘‘సాయంత్రం నడకకు వెళ్లింది’’ అంటూ భారత్ ఆర్మీ పేరుతో భారత అభిమానుల సంఘం రిప్లయ్ ఇచ్చింది. ఈ విడత నీటిలో ఉన్న ఒక బాతు తలకు డకౌట్ అయిన జోరూట్ తలను తగిలించింది. టీమిండియా వైపు నుంచి ఒక్క కోహ్లీయే డకౌట్ కాగా, దీన్ని బార్మీ ఆర్మీ అవకాశంగా తీసుకుంది. ఇంగ్లండ్ వైపు నుంచి డకౌట్ అయిన స్టోక్స్, రూట్ చిత్రాలను ఉపయోగించి నోరు పెగల్లేని విధంగా భారత్ ఆర్మీ బదులిచ్చింది.
భారత్ ,ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్
128
previous post