బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రైతులకు రైతుబంధు నిధులను ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. శనివారం నాడు రావిర్యాల, మోహబ్బత్ నగర్, కే. సి. తండా, మహేశ్వరం, తుక్కు గూడ జరిగిన రోడ్ షో లలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని పేర్కొంటూ రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం శోచనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నా, కేవలం మూడు గంటలు రైతులకు చాలని అవమానపరచడం కాంగ్రెస్ పార్టీకి తగదని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే రైతులు 10 ఎచ్ పి మోటార్లు బిగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని, అయినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని మంత్రి వివరించారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్ల నష్టం చేసిన బీజేపీకి ఓట్లడిగే అర్హతే లేదని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని బీజేపీ సర్కారు ఒత్తిడి చేసిందని మేము చెబుతుంటే లేదు లేదు తమ ప్రభుత్వం ఆ మాటే అనలేదని తెలంగాణ బీజేపీ నేతలు అదరగొట్టిండ్రని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని అన్నారు. పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో నిలపాలని ప్రజల్ని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలను కూడా తప్పని సరిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ బీజేపీ లపై తీవ్ర విమర్శలు చేసిన విద్యాశాఖ మంత్రి
58
previous post