విజయనగరం జిల్లా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన. బొబ్బిలి వేదికగా బహిరంగ సభ. తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు రానున్నారు. బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు తమ్ముళ్లను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల వాతావరణం దగ్గరపడడంతో ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగానే ‘రా… కదిలి రా’ అనే కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈసారి బొబ్బిలి వేదికగా విజయనగరం – పార్వతీపురం మన్యం జిల్లాల కేడర్‌కు బాబు దిశానిర్థేశం చేయనున్నారు. బొబ్బిలి కేంద్రం ఈ రెండు జిల్లాలకు సమాంతర దూరంలోనూ, పార్టీకి కాస్త బలమైన నియోజకవర్గంగాను గుర్తించిన పార్టీ ఇక్కడ సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా టిడిపి నాయకులు చెబుతున్నారు. బాబు వరుస పర్యటనలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల టికెట్ల పై కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బాబు దృష్టిలో పడేందుకు కూడా తహతహలాడుతున్నారు. గత నెల 20న పోలిపల్లి బహిరంగ సభ మాదిరిగానే దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేడు జరగనున్న బహిరంగ సభల్లో కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడం, వైసిపిలోనూ, ప్రభుత్వంలోనూ లోపాలను, వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అమలుకాని హామీలను ఎత్తి చూపడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
బుధవారం ఉదయం 10.15గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో బయలుదేరి, 11గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొబ్బిలి రాజా కాలేజీ మైదానానికి 11.40గంటలకు చేరుకుంటారు. 12గంటలకు సభ ప్రారంభమై 1.30గంటలకు ముగుస్తుంది. అనంతరం 2.30గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మిగిలిన గంట వ్యవధిలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. బహిరంగ సభ ఏర్పాట్లును మంగళవారం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు, నియోజకవర్గ ఇన్‌చార్జి బేబినాయన, కూన రవికుమార్ తదితరులు పరిశీలించారు..