సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను.. మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. గిరిజన సంప్రదాయాలు, శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు పూనుగొండ్ల సమీపంలోని దేవుడి గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజాకార్యక్రమాల అనంతరం పెన్క వంశీయులు పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా సిద్ధం చేస్తారు. ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళతారు. పూజారి జగ్గారావుతోపాటు మరో పదిమంది పూజారులు, పలువురు భక్తులు పగడిద్దరాజు వెంట బయలుదేరుతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల వద్ద రాత్రికి విడిది కల్పిస్తారు. బుధవారం ఉదయాన్నే బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తామని ప్రధాన పూజారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.