పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు సెట్ బ్యాక్ క్రమబద్దీకరణ లో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించి జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పట్టణ కేంద్రంలో 5 కట్టడాలపై ఫిర్యాదులు అందాయని అందులో 2 కట్టడాలను సీజ్ చేసినట్లు, మిగిలిన 3 కట్టడాలను పాక్షికంగా కూల్చి, ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు డిటీఎఫ్ టీం లీడర్ గిరి మీడియాకు తెలిపారు.
ఇదే క్రమంలో మంథని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి మాట్లాడుతూ.. పట్టణంలో మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ లో రెవెన్యూ శాఖ, ఆర్ అండ్ బి శాఖ, మున్సిపాలిటీ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ కలిపి డిటిఎఫ్ టీం గా కలిసి పని చేయనున్నాయి అని అధికారులు తెలిపారు. నిర్మాణాల కూల్చివేత సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా కూడా అధికారులు, పోలీసులు కలిసి కట్టుదిట్టంగా విధి నిర్వహించారు.