పొట్ట కొచ్చిన పంటను కాపాడేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, సాగునీరు కోసం నానా తంటాలు పడుతున్నారని, కాలువల ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని, బోరు బావుల పైనే ఆధారపడి రైతులు పంటను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. రైతుల సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని,, రిజర్వాయర్లలో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లున్న వాడుకోలేని అసమర్ధ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు. కనీసం కుంటలు, చెరువులు నింపుదామన్న సోయి, కాలువలకు నీళ్లు ఇచ్చి పంటలను కాపాడుదామన్న ధ్యాస రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
జిల్లాలోని అనేక ప్రాంతాలు సాగునీటి కోసం అలమటిస్తున్నాయని, అనేక చోట్ల పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లు లేక మిర్రలు బారిన పొలాల్లోని వరి పైరు తల వాలుస్తున్నాయన్నారు. జిల్లాలో నీటి నిల్వలు అనేకం ఉన్న , నీటిని సక్రమంగా సరఫరా చేయకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. చాలామంది రైతులు సాగునీటి కోసం బోర్లు బావుల పై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చిందని, కొత్త బావులు తవ్వుకుంటూ బోర్లు వేస్తూ పంటలను కాపాడేందుకు సర్వశక్తులు దారపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికోచ్చిన పంట కోసం రైతులు పడుతున్న కష్టం దయనీయంగా ఉన్నా మానవ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతుల కష్టాలను పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిని నిరసిస్తూ ఈనెల 16న బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట ధర్నా, ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని రైతులు అధైర్యపడవద్దని రైతులకు బిజెపి ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.