అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పోతవరంలో మాదిగ జెఏసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా మాదిగ పొలిటికల్ జెఏసి గౌరవ అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా పీసి పాయింట్స్ మాట్లాడారు. కోనసీమలో సామాజిక న్యాయం జరగడం లేదని ఆకుమర్తి అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కోనసీమలో మాదిగలు చేస్తున్న పోరాటానికి ఇతర కులాలు కూడా మద్దతివ్వడం శుభపరిణామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకూ కోనసీమలో మాదిగ సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ రాజకీయ ప్రాధాన్యం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. అన్ని పార్టీలు మాదిగ లను మోసం చేస్తున్నాయని, మాదిగ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలలో కోనసీమ నుండి రెండు ఎమ్మెల్యే స్థానాలు గానీ ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో మాదిగలకు సీట్లు కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, రేపు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ దళిత గిరిజనులకు రావాల్సిన రూ.70 వేల కోట్ల నిధులు కాజేసి, రూ.4 వందల కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము స్వాగతించబోమని, దళిత గిరిజనుల కోసం కేటాయించిన 70వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నిస్తున్నమని అన్నారు. మాల, మాదిగ, రెల్లి మూడు కార్పొరేషన్లకు నిధులు ఎందుకు కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వం మాదిగలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. దళితులను చంపిన నాయకులను మీ వెంట తిప్పుకోవడం బాధాకరమని, మాకు న్యాయం జరగనప్పుడు ఈ విగ్రహాలు ఎందుకని జెఏసి నాయకులు ప్రశ్నించారు. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కోసం ఈ నెల 28న పి.గన్నవరంలో తలపెట్టిన “హలో మాదిగ- ఛలో గన్నవరం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకుమర్తి చిన్నా పిలుపునిచ్చారు.
పోతవరంలో మాదిగ జేఏసీ సమావేశం…
75