భవన నిర్మాణ సంక్షేమ సంఘానికి భారీ విరాళాన్ని, సంఘ కార్యాలయం కోసం ఏడు సెంట్ల విలువైన స్థలాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అందజేశారు. ఏపిజె అబ్దుల్ కలాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సభ్యులు కార్యలయం కోసం సాయం చేయాలని గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు దువ్వూరు రోడ్డులోని బైపాస్ వద్ద మొదట ఐదు సెంట్ల స్థలాన్ని వారికి కేటాయించి, ఆ స్థలం తాలూకు పత్రాలను నేడు భూమి పూజ అనంతరం సంఘ నిర్వాహకులకు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే భవన నిర్మాణానికి ఐదు లక్షలు, సంఘం నిర్వహణ కోసం మూలధనం కింద మరో 50 లక్షల రూపాయలు అందజేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు ఈ సందర్భంగా ప్రకటించారు. తాను రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో ఇదంతా చేయడం లేదన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. సమాజంతో చమటోడ్చి పనిచేసే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి, సమిష్టిగా పనిచేయాలన్నారు. అందుకు తన వంతు బాధ్యతగా సాయం అందిస్తానన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ, ఏ పార్టీ కూడా భవన నిర్మాణ కార్మికులను పట్టించుకున్న దాఖల్లాలేవన్నారు. తాను మంచి చేశానని విశ్వసిస్తే తనకు మద్దతు ఇవ్వాలన్నారు. తాను చేసిన కార్యక్రమాలు అందరినీ తనవైపు మరలేలా ఆ శివ పార్వతులే చేస్తారని ఎమ్మెల్యే రాచమల్లు విశ్వాసం వ్యక్తం చేశారు. మొదట ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించినప్పటికీ, కార్మికుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కార్యాలయం, ఫంక్షన్ హాలు నిర్మాణానికి అదనంగా మరో రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులకు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. భవన నిర్మాణం పనులు మొదలు పెడితే నిర్మాణ ఖర్చుల కోసం ఐదు లక్షలు, సంఘం పూర్తి స్థాయిలో ఏర్పడి సంక్షేమ కోసం పనులు ప్రారంభిస్తే అప్పుడు మూల ధనం కింద 50 లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే రాచమల్లుకు కృతజ్ఞతలు తెలిపారు.
భవన నిర్మాణ సంక్షేమ సంఘానికి రాచమల్లు భారీ విరాళం…
92
previous post