పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ చాపకుడు సిద్ధాంతం.. వింటే మొట్ట మొదట గుర్తొచ్చేది గురజాల నియోజకవర్గం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాటి పౌరుషానికి ప్రతీక గురజాల. ఇప్పుడు ఇక్కడ వైసీపీ – టీడీపీకి మధ్య పలనాటి యుద్ధమే నడుస్తుంది.. ఎన్నికల నగారా మోగిన వేళ రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరు యుద్ధాన్ని తలపిస్తుంది. గురజాల పౌరుషం ఏంటో..! ప్రత్యర్థులు ఎవరో..!! వారి బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!!
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం గురజాల.. 1952 లో ఏర్పడిన గురజాలలో ఇప్పటికీ 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, టీడీపీ 4 సార్లు, సిపిఐ 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి ఈ గడ్డపై గెలిచారు. గత ఎన్నికల్లో మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి తమ్ముడి మనవడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాసు కుటుంబానికి ఉన్న పేరు, మాజీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అండతో కాసు మహేష్ రెడ్డి విజయం సునాయాసంగా జరిగింది.. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న గురజాలలో టిడిపి ఏర్పాటు అయిన దగ్గర నుండి ఆ పార్టీ పాగా వేసింది… ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా టిడిపి నుంచి యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. ఈ గడ్డపై నుండి టీడీపీ తరఫున ఆరు సార్లు పోటీ చేసిన యరపతినేని మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడిపోయారు.. 1994 లో తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచిన యరపతినేని.. ఆ తరువాత 1999, 2004 ఎన్నికలలో ఓడిపోయారు, 2009, 2014 ఎన్నికల్లో గెలవగా 2019 ఎన్నికల్లో పరాజయం చెందారు. ఇప్పటికే ఎన్డీయే కూటమి రెండో జాబితాలో యరపతినేని శ్రీనివాసరావు పేరును టిడిపి అధిష్టానం ప్రకటించింది… దీంతో ఆయన గురజాల నుంచి వరుసగా ఏడవసారి పోటీ చేస్తూ రికార్డు సృష్టించబోతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గత ఎన్నికల్లో యరపతినేని వైసీపీకి చెందిన కాసు మహేష్ రెడ్డి చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.. అయినా నియోజకవర్గ ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రతీ కార్యకర్తకి అండదండగా నిలబడి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సారి జనసేన, బిజెపి పొత్తుతో విజయం తనదేనని యరపతినేని ధీమాతో ఉన్నారు. గురజాలలో టిడిపి శ్రేణులు బలంగా ఉన్నారు. కాసు మహేష్ రెడ్డి తన కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలతో వైసీపీ శ్రేణులు ఇటీవల టిడిపిలో భారీగా చేరారు. జనసేన సహాయంతో తన విజయం సునాయాసమేనని యరపతినేని ధీమాగా ఉండగా… మళ్లీ విజయడంకా మోగించేందుకు కాసు మహేష్ రెడ్డి అస్త్ర, శస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని మహేష్ రెడ్డి ఆశతో ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో మహేష్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన బీసీ నేత జంగా కృష్ణమూర్తి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఇది ఇలా ఉంటే.. వైసీపీ శ్రేణులు..! ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు.. మరో వైపు 2014 టీడీపీ, 2019 వైసీపీ హయాంలోనూ అభివృద్ధి జరిగిందని గురజాల ప్రజలు చెప్పుకుంటున్నారు.. ముఖ్యంగా యరపతినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 వేల మందికి ఇళ్ల పట్టాలు, ఆర్డీవో కార్యాలయం, పుష్కరాల సందర్భంగా భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టారని స్థానికులు సంతృప్తిగా ఉన్నారు…. అదే సందర్భంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అందిన సంక్షేమ పథకాలు, గురజాలలో మెడికల్ కాలేజీ నిర్మాణాలు గొప్పగా చెప్పుకుంటున్నారు… అయితే ఇప్పటికీ కూడా తమకి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటున్నారు, కెమికల్ ఫ్యాక్టరీలు వెదజల్లే కాలుష్యం, నియోజకవర్గంలో సరైన రోడ్లు లేకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వెలబుచ్చుతున్నారు..
ఇది చదవండి : నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…
గురజాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,68,469 ఇక్కడ ముస్లింలు, ఎస్సీలు, బీసీలు అభ్యర్థుల జయపజయాలు నిర్ణయించే శక్తిగా ఉన్నారు. కాపులు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు కూడా గణనీయంగానే ఉన్నారు. ముస్లింలు 35 వేలు పైనే ఉన్నారు, బీసీలు 55 వేలు, ఎస్సీలు 35 వేలు, కాపులు 30 వేలు, రెడ్లు 25 వేలు, కమ్మలు 30 వేలు, వైశ్యులు 18 వేలు, ఎస్టీలు 15 వేలు మంది ఓటర్లు ఉన్నారు… టిడిపికి 38.98 శాతం మొగ్గు చూపుతున్నారు, జనసేనను 8.62 శాతం ఆదరిస్తున్నారు, వైసీపీ ని 36.24 శాతం మంది మాత్రమే మెచ్చుకుంటున్నారు.. 15.23 శాతం మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నమ్మన్నారు.. ఏది ఏమైనప్పటికి గురజాల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ మాత్రం పక్కా కనిపిస్తుంది.. ఇక్కడి ఓటర్లు చివరికి ఎవరిని కరుణిస్తారో..! పల్నాటి గడ్డపై గెలిచే గుర్రం ఎవ్వరో..!! వేచి చూడాలి మరి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి