సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ (Arrest)…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ (Arrest)తో పార్టీలో నాయకత్వ లేమి ఏర్పడింది. ఆయన గైర్హాజరీలో ఆప్‌ను ముందుండి నడిపించేదెవరన్న ప్రశ్న పార్టీ వర్గాలను వేధిస్తోంది. అయితే, కేజ్రీవాల్ భార్య సునిత పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఢిల్లీ కేబినెట్ మంత్రులు, కేజ్రీవాల్‌కు నమ్మకస్తులైన ఆతిషీ, సౌరభ భరద్వాజ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ముందుండి నడిపించే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం పార్టీ ముందున్న ప్రధాన సవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కేజ్రీవాల్ పార్టీకి ముఖ చిత్రంగా మారారు…
2012లో ఆప్ ప్రారంభమైన నాటి నుంచీ కేజ్రీవాల్ పార్టీకి ముఖ చిత్రంగా మారారు. పార్టీ కన్వీనర్‌గా, దాదాపు దశాబ్దకాలంలో మూడు సార్లు సీఎంగా సేవలందించిన కేజ్రీవాల్ స్థాయి వ్యక్తిని ఎంపిక చేయడం పెద్ద సవాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌తో పాటు గుజరాత్, అస్సాం, హర్యానాలో కూడా బరిలోకి దిగనుంది. ఆయా రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ప్రధాన కాంపెయినర్‌గా మారారు. ఇక, కేజ్రీవాల్‌కు నమ్మకస్తురాలిగా ఉన్న కేబినెట్ మంత్రి ఆతిషీ ప్రభుత్వంలో అత్యధిక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, పీడబ్ల్యూడీ, రెవెన్యూ శాఖలతో ఇతర డిపార్ట్మెంట్ల బాధ్యతలు చూస్తున్నారు. పార్టీలో మరో కీలక నేత సౌరభ్ భరద్వాజ్ కూడా ఆరోగ్యం, అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక శాఖల్ని నిర్వహిస్తున్నారు. పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న ఆయన అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై బలమైన విమర్శలు చేస్తూ పార్టీని వెనకేసుకొచ్చారు. ఇక కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ సునిత పేరును కూడా పార్టీ వర్గాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించిన బీఆర్ఎస్…
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi liquor scam case)లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ స్పందించింది. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ అణచివేతకు ఈడీ, సీబీఐలు ప్రధాన సాధనాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, రాజకీయ ప్రతీకారమే వారి ఏకైక ఉద్దేశమని కేటీఆర్ మండిపడ్డారు.
కాగా ఇదే కేసులో కేటీఆర్ సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్తో సహా సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను పలు పార్టీలు ఖండించాయి. కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీతో పాటు పలు విపక్ష పార్టీలు కేజ్రీవాల్ అరెస్టును తప్పుబట్టాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడం రాజకీయ కక్షసాధింపేనని ఆయా పార్టీలు వ్యాఖ్యానించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ బలపడుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ పలు పార్టీల నేతలు బీజేపీపై మండిపడ్డారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి