ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా తెర మీదకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు. గన్నవరంలో ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ తో పాటుగా దిగిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల వేళ చంద్రబాబుతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోదీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు. జగన్ గెలుపు తరువాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నాఆయన టీం వైసీపీ కోసం పని చేస్తోంది. ఇదే సమయంలో ఐ ప్యాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి రుషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో కొంత కాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత ఏపీ రాజకీయాల పైన కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ హామీల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు, జనసేనతో పొత్తుతో వెళ్లటంతో పాటుగా సంక్షేమ మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో చేసిన సర్వే నివేదికలను చంద్రబాబుకు అందించినట్లు సమాచారం. టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందీ ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ టీడీపీకి పీకే సూచనలు, సలహాలు కొనసాగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, పీకే ఎంట్రీతో టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందా జగన్ ఎలా ఎదుర్కొంటారు. మొత్తంగా ఏపీ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. తమ పార్టీకి వ్యూహకర్తగా పని చేయకపోయినా రాజకీయ సలహాదారుగా వ్యవహరించాలని కోరారు. ఒకసారి చంద్రబాబుతో సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తాడేపల్లి చేరుకున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ కోసం పని చేసి ఉండటంతో జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాల పైన పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. దీంతో, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేస్తే జగన్ ను ఓడించటంలో సహకరిస్తుందని విశ్వసిస్తున్నారు.