వెల్దుర్తి ఉమ్మడి మండల పరిధిలో జిల్లా కలెక్టర్ రాజార్షీషా పర్యటించారు. మండల పరిధిలోని ఉప్పు లింగాపూర్, హకీంపేట గ్రామాలలో పర్యటించిన కలెక్టర్ రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం 5 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని ఇప్పటివరకు వెయ్యి ఎకరాలలో సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చి డీడీలు చెల్లించారని ఆయన అన్నారు. రైతులకు సబ్సిడీపై డ్రిప్పు పరికరాలు సమకూరుస్తామని, ఉపాధి హామీ కూలీల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతుకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తున్నందున ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయాలని సూచించారు. సాంప్రదాయంగా ఒకే పంటపై ఆధారపడకుండా ఆదాయం వచ్చే పంటలను పండించేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజార్షీషా పర్యటన…
70
previous post