నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని, అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అంబటి విమర్శించారు. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరం కానీ, మరో పార్టీని ఓడించాల్సిన అవసరం కానీ తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలపై తమకేమీ ఆసక్తి లేదని, అక్కడ ఎవరు గెలిచి అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, గొడవలు అనవసరం అని హితవు పలికారు. సాగర్ కు సంబంధించి తమ వాటాకు మించి ఒక్క నీటి చుక్క కూడా వాడుకోలేదని అన్నారు. ఈ విషయంలో గతంలో చంద్రబాబు సర్కారు విఫలమైతే, ఇప్పుడు జగన్ సర్కారు సక్సెస్ అయిందని మంత్రి అంబటి గర్వంగా చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అసలీ వివాదం చంద్రబాబు హయాం నుంచే ఉందని, సాగర్ కుడి కాలువను కూడా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుండడం చట్టవిరుద్ధమని తెలిపారు. మా నీళ్లు మా రైతులకు విడుదల చేయాలంటే మేం తెలంగాణ అనుమతి తీసుకోవాలా? అని అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాటాను తాను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి కావాలని, పురందేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ డ్యామ్ అంశంలో ఏపీ ప్రభుత్వ చర్యలను ఎవరూ తప్పు పట్టలేరని, ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయాలకు ముడివేసి, తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం తగదని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 13వ నెంబరు గేటు వరకు భౌగోళికంగా ఏపీకి చెందుతుందని, అంతవరకే తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కృష్ణా బోర్డు నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యవహరించడంలేదని, అందుకే ఏపీ హక్కులను కాపాడుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. “రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నాగార్జునసాగర్ డ్యామ్ లోని 26 గేట్లలో 13 గేట్లు ఏపీకి, మరో 13 గేట్లు తెలంగాణకు చెందుతాయి. కానీ సాగర్ ప్రాజెక్టు మొత్తాన్ని తెలంగాణ స్వాధీనం చేసుకుని నిర్వహిస్తుండడంతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ఇప్పుడు సాగర్ డ్యామ్ లో ఏపీకి చెందిన భూభాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదు” అని మంత్రి అంబటి వివరించారు.
సాగర్ వివాదంపై మంత్రి అంబటి వ్యాఖ్యలు..!
82
previous post