అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని హాస్పిటల్ స్టాప్ వద్ద వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని డాక్టర్ హిమబిందు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. అలాగే రాత్రి సమయంలో కూడా గైనకాలజిస్ట్ సహా అత్యవసర వైద్య సిబ్బంది విధుల్లో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.
Ap
ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని అప్పటికి ఎపీలో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానానికి కాలేజీ యాజమాన్యాలు వివరించాయి. ఏపీలో సుమారు 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, గడువు ముగియడంతో కౌన్సెలింగ్ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి. జాతీయ మెడికల్ కమిషన్‌కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు గడువుకు విజ్ఞప్తి చేశాయని పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే, యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సమాధానం రాలేదని పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. మెడికల్ కాలేజీ యాజమన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు పూర్తి స్థాయి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ఎన్నికల హామీలులో భాగంగా పదివేల అరవై ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అన్నారు. దీనికి సంబంధించి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటించామని చెప్పారు . జగన్ అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్‌ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కానీ, ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొన్నారు . నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని మంత్రి సవిత అన్నారు.
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిళ్లిందని అధికారులు వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా అధికారులు తేల్చారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు.
అలాగే, ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సూచించారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఆరు జిల్లాల్లోని 16 మండలాలు, 89 గ్రామాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడిందని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పంటల వారీగా చూస్తే 630 హెక్టార్లలో మొక్కజొన్న, 384 హెక్టార్లలో వరి, మరో 200 హెక్టార్లలో మినుము వంటి పంటలు నీటి పాలయ్యాయని తెలిపారు. అటు అరటి, మామిడి వంటి ఉద్యాన పంటలకు కూడా భారీగా నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా, ప్రతి ఎకరా నష్టాన్ని ఖచ్చితంగా లెక్కించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు.
ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబరు 3న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు సిఎం చంద్రబాబు. ఈ మేరకు ఆ పథకాన్ని ఇవాల్టి నుంచి అమలు చేయనున్నారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రిపై భేటీయై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన..ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో తన పేరు ప్రస్తావనకు రావడం దురదృష్టకరమని..తాను డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమేనని..కానీ తాను ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ప్రజలకు, పార్టీ అధిష్టానానికి వాస్తవాలు తెలియజేస్తున్నానని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను అర్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన గౌరవార్థంగా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక.. అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి మహనీయుడన్నారు.
పొట్టి శ్రీరాములు త్యాగం లేకపోతే ఈరోజు మనకు ప్రత్యేక రాష్ట్రం ఉండేది కాదన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే నవ్యాంధ్రను నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. భావి తరాలకు ఆయన స్ఫూర్తి కలకాలం నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించామని చెప్పారు. అమరజీవి త్యాగాన్ని స్మరిస్తూ ప్రభుత్వం ప్రతి ఏడాది అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుందని సీఎం ప్రకటించారు. కేవలం విగ్రహానికే పరిమితం కాకుండా, ఆయన ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
స్మృతివనం అభివృద్ధి కేవలం విగ్రహానికే పరిమితం కాకుండా, రెండో దశలో మరిన్ని వసతులు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా.. అత్యాధునిక మ్యూజియం, ఆడిటోరియం, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్మించనున్నారు. అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటూ, భావితరాలకు ఆయన ఆశయాలను చాటిచెప్పేలా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దినట్లు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన గౌరవార్థం అమరావతిలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు కొనియాడారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహంగా ఇది రికార్డు సృష్టించింది. శాఖమూరులో సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అమరజీవి స్మృతివనం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేయడం విశేషం.
మద్యం కుంభకోణంలో మరో అరెస్టు.. లిక్కర్ కంపెనీల ద్వారా వసూలుచేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్ ప్రకాశ్‌ను సోమవారం నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. అతడిని ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొస్తున్నారు. ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరుస్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డికి ప్రణయ్ ప్రకాశ్ అనుచరుడు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. మద్యం కంపెనీల నుంచి లిక్కర్ గ్యాంగ్ వసూలు చేసిన డబ్బును తాడేపల్లిలోని ల్యాండ్‌మార్క్ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో భద్రపరిచారు. వసూలుచేసిన డబ్బుకు ఇది డెన్‌గా ఉండేది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు డబ్బును ఎన్నికల సమయంలో పంపారు.
ఈ డెన్‌ను ప్రణయ్ ప్రకాశ్ నిర్వహించేవాడు. మరో నిందితుడు కిరణ్‌కుమార్‌కు ఇతడు స్నేహితుడు. డెన్‌లో ఉన్న డబ్బును చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పిన నియోజకవర్గాలకు పంపేవాడు. ఏ నియోజకవర్గానికి ఎంత మొత్తం పంపాలో దిశానిర్దేశం చేసేవాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రణయ్ దుబాయ్ పారిపోయాడు. అక్కడ ఉక్కు కర్మాగారం స్థాపించడానికి డీపీఆర్ తయారు చేశాడు. చెవిరెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేశాక దుబాయ్ నుంచి ప్రణయ్‌ను సిట్ అధికారులు పిలిపించారు. వారడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు. న్యాయస్థానంలో వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఆ తర్వాతి నుంచి విచారణ గైర్హాజరయ్యాడు. చెవిరెడ్డితో టాంజానియాలో సమావేశమై ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయాణాలు చేశాడు. సిట్ అధికారుల నుంచి తప్పించుకోవడానికి థాయ్‌లాండ్, టాంజానియా, జింబాబ్వేల్లో తిరిగాడు. తర్వాత ఎక్కడికో పారిపోయాడు. తాజాగా నేపాల్ సరిహద్దుల్లో ప్రణయ్ ప్రకాశ్ ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అతడి చేతులకు సంకెళ్లు వేశారు.



Total views : 202976