కడప జిల్లాలో వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరులో వ్యాపారులను, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో పోలీసులు తనిఖీలు చేస్తూ ఎలాంటి రసీదులు, ఆధారాలు లేవంటూ పెద్ద ఎత్తున నగదు సీజ్ చేయడం పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాపారులకు మద్దతుగా పట్టణంలోని బంగారు అంగళ్ల సర్కిల్ లో వ్యాపారులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా, కోడ్ అమలులోకి రాక ముందే సామాన్యులు తమ అవసరాల కోసం బంగారు, బట్టలు కొనుగోలు కోసం తెచ్చుకున్న సొమ్మును రసీదులు, తగిన ఆధారాలు లేవని సీజ్ చేయడం సరైంది కాదన్నారు. తాను చేస్తున్న అభ్యంతరాలను వ్యాపారులకు సామాన్య ప్రజలకు జరుగుతున్న నష్టానికి నిరసన అని భావిస్తారో, రక్షణ అని భావిస్తారోగానీ ఇది ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకం కాదని, ప్రజలు పడుతున్న ఇబ్బందిని తెలియజెప్పే ప్రయత్నమే అన్నారు. ప్రజల ఇబ్బందులను సిఎం దృష్టికి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడి వ్యాపారాలు జరగక పోతే, అన్ని వ్యాపార సంఘాల వారు బంద్ చేసే పరిస్థితి వస్తుందన్నారు. అదే జరిగితే ప్రొద్దుటూరు వ్యాపారుల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో నష్టం కలుగుతుందని చెప్పారు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోసం ఎవరైనా డబ్బులు తీసుకెళ్లే రాజకీయ నేతలను పట్టుకుంటే అర్ధముందని, ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు కూడా ప్రజలకు, వ్యాపారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులు…
66
previous post