దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కేసీఆర్‌ది సంక్షేమమని, ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నాడు కందుకూరు మండలంలోని మాదాపూర్, కోలన్ గూడ, గుమ్మడివెల్లి, ఆకుల మైలారం, మీర్ ఖాన్ పేట్, అన్నోజిగూడ, గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలని కోరారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ఇటువైపు ఉంటే.. ఎన్నికలు సమీపించగానే ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్, బి జె పి మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే, కేవలం మూడు నుంచి నాలుగు గంటలు వ్యవసాయ కరెంటు ఇస్తున్న కర్ణాటక మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వైపు సందర్భం దొరికిన ప్రతీ సారి తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బి జె పి నాయకులు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం చేసింది కేసీఆరేనని, ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని పేర్కొంటూ మళ్లీ బి అర్ ఎస్ పార్టీని గెలిపించి కేసీఅర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు.
Read Also….