ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. మిరప దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళితే పలనాడు జిల్లా దాచేపల్లి మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న తుఫాను కారణంగా చేతికి అంది వచ్చిన మిర్చి నీట మునిగిపోయాయి. వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పంట పొలాల దగ్గరికి వచ్చి రైతుల పరిస్థితి ఏంటి అని చూసిన పాపాన పోలేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల గట్ల వెంబడి తిరుగుతూ నీట మునిగిన పొలాలను చూసిన రైతుల గుండె తరుక్కుపోతోంది. మిచౌంగ్ తుపాను అన్న దాతను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక సాగుదారులు మౌనవేదనతో తల్లడిల్లిపోతున్నారు. గతేడాది మాండౌస్.. ఈసారి మిచౌంగ్ తుఫాన్ రూపంలో రైతులను నిండా ముంచాయి. మొత్తం మీద తుపాను మిర్చి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తుంటే, తుఫాను దాటికి రైతులు పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..