రోజు రోజుకీ సైబర్ నేరాలు (Cyber crime) విజృంభిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసి, నియంత్రించుటకు గాను రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా , తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మరియు కమీషనరేట్లయందు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల (Cyber crime Police station)ను ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ కి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను కేటాయించగా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశామని , మంగళవారం నుండి పూర్తి స్థాయిలో (సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సేవలు అందుబాటులోకి వచ్చాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్.హెచో. ఓ. గా ఏసీపీ నర్సింహారెడ్డి ని నియమించామన్నారు. భాదితులు నేరుగా వచ్చి వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు నేరం చేసే విధానాన్ని మార్చుతూ , ఖాతాల్లో గల డబ్బు దోచుకుంటారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులకు ఫోన్ల ద్వారా వ్యక్తిగత పాస్ వర్డ్ , ఓటీపీ లు అందించడం , ప్రలోభాలకు గురిచేసే లింక్ లను క్లిక్ చేయడం వంటి విషయాల్లో ఎప్పటికప్పుడు చాలా అప్రమత్తంగా వుంటూ సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. సైబర్ క్రైమ్ గురైన భాదితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930 కి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సైబర్ వారియర్స్ టీం ఏర్పాటు. కమీషనరేట్ వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే సైబర్ నేరాలను పోలీస్ స్టేషన్ల వారీగా ఎక్కడికక్కడ అరికట్టి నియంత్రించేందుకు గాను సైబర్ వారియర్స్ టీం ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ కు టెక్నాలజీ పై అవగాహన వున్న సిబ్బందిని గుర్తించి వారిని సైబర్ వారియర్ గా నియమించామన్నారు. క్షేత్ర స్థాయిలో భాదితులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకుగాను వీరిని ఏర్పాటు చేశామన్నారు. సైబర్ కేసుల్లో ఆధారాలు సేకరించి, నేరస్థులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుని భాదితులకు న్యాయం జరిగేలా చూడడం వీరి ముఖ్య విధిగా ఉంటుందన్నారు.
ఇది చదవండి: తీహార్ జైల్ ఎక్కడుందో తెలుసా..??
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి