Medigadda:
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ (Medigadda) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ఈ బృందం రానుంది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 40 బస్సుల్లో మేడిగడ్డకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. బ్యారేజీ నిర్మాణ లోపాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
అలాగే బ్యారేజీ వంతెనపై కుంగిన పిల్లర్ మీదుగా మహారాష్ట్ర వైపు నుంచి గోదావరి నదిలో పగుళ్లు తేలిన పిల్లర్ల వద్దకు రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుండగా అక్కడ సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా బ్లాక్-7లోని 20వ పిల్లర్ ను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉండటంతో ఆ ప్రదేశంలో ఊటల ద్వారా వస్తున్న నీటిని డీవాటరింగ్ చేస్తున్నారు. కుంగిన ప్రాంతంలో కాంక్రీటు పగుళ్లు తేలడంతో గోదావరి ప్రవాహాన్ని మరల్చేందుకు ఏర్పాటు చేసి మట్టి కట్టల ద్వారా ఊటలు ఉబికివస్తున్నాయి. దీంతో పెద్ద మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నారు. కుదురుపల్లి నుంచి మహదేవపూర్ మండల కేంద్రం, ఎల్అండ్ టి రోడ్డు మీదుగా నేరుగా మేడిగడ్డ బ్యారేజీకి ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకోనున్నారు. తిరిగి అదే మార్గంలో హైదరబాద్ కు వెళ్లనున్నారు.
హైదరాబాద్ నుంచి ఏసీ బస్సుల్లో ఉదయం 10:15 కు బయల్దేరనున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు చేరుకోన్నారు. బ్యారేజీ వద్ద పరిశీలన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యే తిరిగి హైదరబాద్ కు బస్సుల్లో బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి మాత్రం మేడిగడ్డ (Medigadda) నుంచి హెలిక్యాప్టర్ ద్వారా హైదరబాద్ కు వెళ్లే అవకాశం ఉంది
మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్, ప్రజాప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్, ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన, పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్ బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. Read Also..
మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.