పెద్దపల్లి జిల్లాలో ముఖ్య నేతలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ దంపతులు ఇద్దరు కూడా రాజీనామా చేయనున్నామని వెల్లడించడం సంచలనంగా మారింది. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్, ఆయన సతీమణి, మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజలు ప్రజాప్రతినిధులుగా రాజీనామా చేయనున్నట్టు ఆయన కార్యాలయ వర్గాల పేరిట ఓ ప్రకటన వెలువడింది. బుధవారం మద్యాహ్నం రాజీనామా పత్రాలను జిల్లా కలెక్టర్ కు అప్పగించనున్నామని కూడా అందులో వివరించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన పుట్ట మధూకర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఫలితాలు వెలువడినప్పటి నుండి కూడా సైలెంట్ గానే ఉన్న పుట్ట మధు అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా శ్రీధర్ బాబుకు, పుట్ట మధుకు దశాబ్దన్నర కాలంగా వైరుధ్యాలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగానే పొలిటికల్ ఫైట్ జరిగిందనే చెప్పాలి. అయితే తాజాగా పుట్ట మధు తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంశంపై పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతోంది. అయితే బుధవారం రాజీనామా చేసిన తరువాత రాజీనామాకు గల కారణాలను వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
పదవులకు రాజీనామా చేయనున్న ముఖ్య నేతలు..
88
previous post