నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్ పండుగ ముంగిపు దశకు చేరింది. ట్రోఫీ కోసం నేడు జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఐదుసార్లు విశ్వ విజేత అయిన ఆసీస్ కొమ్ములు వంచి మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని కంగారూలు కసిగా ఉన్నారు. క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో వరల్డ్ కప్ ఫైనల్. అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది. ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్ కప్ ఫైనల్. ఇరుజట్లకు ఇది రెండో టైటిల్ పోరు. 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 20 ఏళ్ల తర్వాత నాటి ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. ప్రస్తుత సమీకరణాలను బటిచూస్తే భారతజట్టే హాట్ ఫేవరెట్. రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోడీ, ఆసీస్ ఉప ప్రధాని రిచర్డ్ మార్ల్స్ విశిష్ట అతిథులుగా వస్తున్నారు. మైదానంలోని 1.30లక్షల మంది ప్రేక్షకులతోపాటు, కోట్లాది క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎయిర్ షో, డ్రింక్స్ ఇన్నింగ్స్ మధ్యలో సంగీత విభావరి, చివరగా లేజర్ షో ప్రదర్శించనున్నారు.
నేడే వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్
75
previous post