ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతల ఇంకా అధికారంలోనే ఉన్నామనే బ్రమలో ఉండి ఏకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. కోడ్ అమలులో ఉండగా సభలు, సమావేశాలు, ఊరేగింపులకు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పని సరి అని తెలిసిన కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దవులూరి దొరబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భారీ సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని పట్టణంలో ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం సీఐ రవి కుమార్ ప్రచారాన్ని అడ్డుకుని అనుమతి లేకుండా ప్రచారం చెయ్యకూడదని దొరబాబు చెప్పారు. ముందుకు వెళ్ళి ప్రచారాన్ని అపేస్తామని వెళ్ళిపోయారు. దొరబాబు కోడ్ ఉల్లంఘనపై పెద్దాపురం మునిసిపల్ కమిషనర్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అయితే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతరం పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులతో రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించి కోడ్ విధి విధానాలను తెలియజేశారు. అయినప్పటికీ అధికార మధంతో వైసీపీ నేతలు కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తం వ్యవహారాన్ని వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిపై దౌర్జన్యానికి దిగారు. రిపోర్టర్ సెల్ ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేశారు. అక్కడే ఉన్న దొరబాబు కనీసం తన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యకపోవడం చూస్తే మీడియాపై దాడులను దొరబాబు ప్రోతహిస్తునట్లే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.