ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం ఉదయం ఆయన కనేకల్లులో సంఘీభావం ప్రకటించారు. అక్కడ వారి దీక్ష శిబిరానికి ఆ పార్టీ నాయకులతో వెళ్లారు. వారి పోరాటానికి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కూడా స్పష్ఠమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల కంటే ఏపీలో అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని నమ్మబలికాడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన వేతనాలనే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఇస్తోందన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా, అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ఎందుకు శ్రద్ధ చూపలేదని కాలవ సూటిగా ప్రశ్నించారు. వారు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి, న్యాయబద్దమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. వారు నిరసన తెలుపుతుంటే వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా సెంటర్ల తాళాలు పగలగోడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5రోజుల పాటు అంగన్వాడిలు న్యాయబద్దంగా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లుగా లేకపోవడం బాధ్యతరహితమన్నారు. అంగన్వాడిల సమస్యల్ని తీర్చడానికి చేతకాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమానవీయంగా సెంటర్లను స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అంగన్వాడీ సమస్యలను తీర్చని వైసీపీ ప్రభుత్వం…
94
previous post