రసాయనిక, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు శ్రీ కాళహస్తిలో ఏపీ సీడ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మోహన్ కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ సభ్యులు, శాస్త్రవేత్తలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి రైతు అవగాహన సదస్సును ప్రారంభించారు. అనంతరం రైతులు ఏర్పాటుచేసిన స్టాల్స్ లను వీక్షించి, రైతులు సేంద్రియ ఎరువులతో ఏ విధంగా పంటలు పండిస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఎంపీ మాట్లాడుతూ స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి వినియోగదారు మరియు పర్యావరణ అనుకూలమైన పురుగు మందుల సూత్రీకరణ మరియు పద్ధతుల ప్రచారంపై రైతులకు అవగాహన సదస్సు మరియు శిక్షణ శిబిరం నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించి సేంద్రియ ఎరువులు వినియోగించుకుని పంటలు పండిస్తే ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుందో రైతులకు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలని తెలియజేశారు. రైతన్నలు సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేయడంచే భూసారం పెంపొందించడమే కాక, మానవాళి జీవనానికి ఈ పంటలు ఎంతగానో ఉపయోగపడతాయని తద్వారా భావితరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతకవచ్చని, కాబట్టి ప్రతి ఒక్క రైతన్న సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేసి ప్రజలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.