విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెమీక్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిధిగా సీఎం శ్రీ వైయస్.జగన్ హాజరయ్యారు. అలాగే ఈ సెమీక్రిస్మస్ వేడుకలకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ మతపెద్దలతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ కేక్ కట్ చేసారు.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ మాట్లాడుతూ…
క్రిస్మస్ వస్తున్న శుభసందర్భంలో ఈ సాయంత్రం పూట అడ్వాన్స్‌గా క్రిస్మస్ను జరుపుకుంటున్నాము. ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే కాకుండా మొత్తం తెలుగురాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్నగా, తమ్ముడిగా మెర్రీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రెవరెండ్ రాజారావు గారు మాట్లాడుతూ సుదీర్ఘంగా దేవుని గురించి సందేశం ఇచ్చారు. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒక్కటే ఒక్క విషయం… మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం. ఆకాశమంత సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం… ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో… అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా ఉంటాం. దేవుడు ఆ మనసు మనందరికీ ఇవ్వాలని, రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నవారితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ మరోక్కసారి మెర్రీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నారు.