దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు, తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సలహాలతో మహానుభావుడు పీవీ నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసిన మేధావుల వాదనపై చర్చలు జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు.
మెదక్ నుండి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పివి పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. పివీ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి నేతృత్వంలో 40 వేల కోట్లతో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పివికే దక్కుతుందన్నారు. పివి శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించిన విధంగా గత ప్రభుత్వంలో 11 కోట్లతో నిర్మితమవుతున్న పీవీ స్మృతి వనానికి సంబంధించి మిగిలిన పనులపై ఒక నివేదిక ఏర్పాటు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్ట పరచడానికి నవోదయ, గురుకులాలు 45 వరకు ఏర్పాటు చేసిన ఘనత పివిదే అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. భూస్వామి అయినప్పటికీ నిరుపేదలకు భూమి పంచడానికి భూసంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ మహనీయుని సేవలను నిరంతరం ఇప్పటి తరానికి పాఠ్యపుస్తకాలల్లో, దృశ్యరూపాల్లో చరిత్రను సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు.