కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నారు. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు’’అని ప్రశ్నించారు. తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. దీంతోపాటు రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 పథకాలను అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో ‘‘సుపరిపాలన దినోత్సవం’’ నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పదవుల కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈరోజుల్లో నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులనే త్రుణ ప్రాయంగా వదిలేసుకున్న మహా నాయకుడు. ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేద వాడి వరకు తీసుకెళ్లాలనే శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలతోపాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తప్పకుండా అమలు చేసిన గొప్ప నాయకుడు. జన సంఘ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న క్రమంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశమంతా జరిగిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా జనతా పార్టీ అలయన్స్ ప్రభుత్వ ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించిన నాయకుడు వాజ్ పేయి గారు. నాటి ప్రభుత్వంలో చేరినప్పటికీ జన సంఘ్ లో ఉన్న వాళ్లు ఆర్ఎస్ఎస్ సభ్యత్వం వదులుకోవాలంటూ ఒత్తిళ్లు రావడంతో తమకు పదవులు ముఖ్యం కాదని రాజీనామా చేసి బయటకు వచ్చి సిద్ధాంత నిబద్దతను చాటి చెప్పి భారతీయ జనతా పార్టీని నెలకొల్పిన గొప్ప నాయకుడు వాజ్ పేయి గారు. 2 ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని ఆ తరువాత ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు అలుపెరగని పోరాటం చేసి మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టి అవినీతి మచ్చలేకుండా నిజాయితీగా, పారదర్శకంగా ప్రజారంజకంగా పాలించిన నేత వాజ్ పేయి. పార్లమెంట్ బలనిరూపణలో ఏఐడీఎంకే అధినేత జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకే ఒక్క ఓటు తక్కువై ప్రభుత్వాన్ని కోల్పోయారు. ఆనాడు ఇతర పార్టీల ఎంపీలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అంతకుముందు దేశాన్ని నడిపిన పాలకులు ఎంపీలను కొనుగోలు చేసి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపి ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిన దాఖలాలున్నప్పటికీ నేను ప్రజల వద్దకే వెళతానే తప్ప ఇట్లాంటి నీతిమాలిన పనులు చేయబోనంటూ ఏకంగా అత్యున్నత ప్రధానమంత్రి పదవినే వదులుకుని తిరిగి ఎన్నికల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నిజాయితీపరుడు వాజ్ పేయి జీవితం నేటి రాజకీయ నేతలకు, పాలకవర్గాలకు ఆదర్శనీయం.
గాంధీజీ కలలు కన్న రామ రాజ్యం… గ్రామ స్వరాజ్య స్థాపన కోసం నిరంతరం పరితపించి అమలు చేసిన మహానీయుడు వాజ్ పేయి గారు. గ్రామీణ సడక్ యోజనతో దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్లు వేసిన ఘనత వాజ్ పేయి గారిదే. స్వర్ణ చతుర్భుజీ పేరుతో 4 లేన్లు, 6 లేన్ల జాతీయ రహదారులను ఏర్పాటు చేసి ప్రజలకు రవాణా మార్గాలను సులభతరం చేసిన దూరద్రుష్టి కలిగిన నాయకుడు. ఇవే కాదు.. ఎయిర్, రైలు కనెక్టవిటీ విషయంలోనూ వాజ్ పేయి ముందుచూపు అందరికీ ఆదర్శనీయం. నిజం చెప్పాలంటే వాజ్ పేయి గారి నిజమైన వారసుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు. మహనీయులను గుర్తుంచుకోవడమంటే వారి జయంతి, వర్దంతిలు జరుపుకోవడానికే పరిమితం కాదని నిరూపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీగారు. వాజ్ పేయి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన బాటలో నడుస్తూ నేడు భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దుతున్న నాయకుడు నరేంద్రమోదీ గారు.
దేశాన్ని అర్ధశతాబ్దానికిపైగా పాలించిన కాంగ్రెస్ నేతల పాలనలో ప్రభుత్వం లబ్దిదారులకు రూపాయి విడుదల చేస్తే అందులో 15 పైసలు మాత్రమే వారికి అందేది. మిగిలిన పైసలన్నీ దళారుల చేతుల్లోకి వెళ్లేవని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారే ఒప్పుకున్న కఠోర సత్యం. పాలనలో అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా లబ్దిదారులకు అందజేయాలనే మహా సంకల్పంతో జీరో బ్యాలెన్స్ తో కొట్లాది మంది పేదలకు బ్యాంకు అకౌంట్లను తెరిపించిన ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తున్న గొప్ప నాయకుడు మోదీ గారు. ఈరోజు గ్యాస్ సబ్సిడీ, కిసాన్ సమ్మాన్ నిధి, పెన్షన్లు సహా అనేక నగదు బదిలీ పథకాలన్నీ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా పేదల ఖాతాల్లోకి పడుతున్నాయంటే అది మోదీగారి చలువే. 2 వందల 25 కోట్లకుపైగా కరోనా డోసులతో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన ప్రాణదాత మోదీగారు. అలాంటి వ్యక్తి మళ్లీ ప్రధాని కావడం ఈ దేశానికి అవసరం… అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ అందించి ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానిని చేద్దాం…. ఈ దేశ ప్రగతిలో భాగస్వాములం అవుదాం…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం దరఖాస్తులను ఆహ్వానించడాన్ని బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నాం. ఎన్నికలు రాబోతున్నాయి. అంతలోపే లబ్దిదారులను గుర్తించాలి. ఎన్నికల సాకుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా దరఖాస్తులకే పరిమితం కావొద్దని కోరుతున్నా… బీఆర్ఎస్ పార్టీ గతంలో నమ్మించి మోసం చేసింది. హామీలిచ్చి చేతులు దులుపుకోవడంవల్లే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఆ తప్పు కాంగ్రెస్ చేయొద్దని కోరుతున్నా. నిజమైన లబ్దిదారులను గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరుతున్నా.. అట్లాగే బీజేపీ కార్యకర్తలంతా అర్హులైన వారందరిని గుర్తించి దరఖాస్తు చేయించాలని కోరుతున్నా. అట్లాగే గత 10 ఏళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షలకు పైగా కుటుంబాలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇంకా దరఖాస్తు చేయని వారు లక్షల్లో ఉన్నారు. వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు 6 ప్రధాన హామీలకు సంబంధించి లబ్ది చేకూర్చేలా చేయాలని కోరుతున్నా… ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లోనే 6 పథకాలను అమలు చేయాలని కోరుతున్నా…కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారో, ఎప్పటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి కాంగ్రెస్ 6 పథకాలను అందిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి.
బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీని తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీదారు కానేకాదు. ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఎన్నికలనే భావన ప్రజల్లో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం తథ్యం. బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యం. బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించినా కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదు. ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమల్లో ఉంటూ మాట్లాడుతున్నడు. శ్వేత పత్రం… స్వేద పత్రం అంటు అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారు. నేనడుగుతున్నా… 50 లక్షల కోట్ల ఆస్తులను సృష్టిస్తే… తెలంగాణలో 6.75 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశారు? భూములెందుకు అమ్ముకున్నాడు? జీతాలెందుకు ఇవ్వలేపోయిండు? బహుశా కేసీఆర్ కుటుంబమే తెలంగాణను అడ్డుపెట్టుకుని 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నట్లుంది.
కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేసిందెవరు? వైకుంఠధామాలుసహా గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే. జాతీయ రహదారుల నిధులన్నీ కేంద్రానివే. చివరకు పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి సర్పంచులకు బిల్లులివ్వకుండా దివాళా తీయించింది మీరు కాదా? బస్తీ దవాఖానాలకు కేంద్రం నిధులిస్తే… బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా గొప్పలు చేసుకుంటూ ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదే.. కోవిడ్ టైంలో మోదీ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడంతోపాటు 80 దేశాలకు పైగా ఉచితంగా వాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే.. సిగ్గులేకుండా బీఆర్ఎస్ అన్నీ తామే చేసినట్లుగా చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటున్నరు.
తెలంగాణ ప్రభుత్వం 6 లక్షల 75 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ఉంది. జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉంది. అయినా 6 గ్యారంటీలంటూ కాంగ్రెస్ హామీలిచ్చింది. అసలు అప్పులను ఎట్లా తీరుస్తారు? 6 గ్యారంటీల అమలుకు నిధులెక్కడి నుండి తీసుకొస్తారు? మీ ప్రణాళిక ఏమిటి? సంపదను ఏ విధంగా స్రుష్టిస్తారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలి? ఈ విషయంలో ప్రజల్లో అనేక సందేహాలున్నాయి? వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుంది? దీనివల్ల ముస్లిం పేద సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉగ్రవాదులను తయారు చేయడంతోపాటు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడే సంస్థ తబ్లిక్ జమాతే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేందో ప్రభుత్వం స్పష్టం చేయాలి. స్మార్ట్ సిటీలో 130 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ పై స్పందిస్తూ…. మేం ఎప్పటి నుండో ఆరోపిస్తున్నాం. నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపలేదు. ఇప్పటికైనా స్పందించింనందుకు సంతోషం. దీనిపై బీజేపీ పక్షాన పోరాడుతాం… అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేదాకా ఉద్యమిస్తాం.