ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమయ్యింది. బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన షర్మిల సోనియా, రాహుల్, ప్రియాంకల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పాత్ర ఎంత ఉండబోతోంది అనే దాని మీద ఆసక్తి నెలకొంది. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అన్నట్లుగానే ఉంది. షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. ఉనికి చాటుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ను ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా నియమించారు. దీన్ని బట్టే కాంగ్రెస్ ఏపీ ఎన్నికలను ఎలా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది జరిగే అవకాశం లేదు. అటు వైసీపీ మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి పోటీని తట్టుకుని కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. కానీ కొన్నిచోట్ల తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాలపై షర్మిలా ప్రభావం ఉండనుంది. ఆ జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే షర్మిలతో టచ్ లో ఉన్నారు. వైసీపీలో మార్పుల పర్వంతో డైలమాలో పడ్డ చాలామంది నేతలు షర్మిల వైపు చూస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాహాటంగానే షర్మిలతో కలిసి నడుస్తానని ప్రకటించారు. తాజాగా మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
గతంలో వైఎస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న నేత మల్లాది విష్ణు. కాంగ్రెస్ లో ఉన్న ఆయన వైసిపి స్థాపించడంతో వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో మరోసారి పోటీ చేసి.. 100 ఓట్ల తక్కువ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలోనే ఈ సారి ఆయనకు సీటు నిరాకరిస్తోంది వైసీపీ అధిష్టానం. మరోసారి గెలిచే అవకాశం లేదనే ఆలోచనతోనే తనను పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలని భావిస్తున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యం కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు మంత్రి పదవి చేశారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలో జాయిన్ అయి ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత మూడు రాజధానుల ప్రకటనతో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్సీ అయ్యారు. డొక్కా కూడా తనకు కనీసం అధినేత జగన్ ను కలవటానికి కూడా అవకాశం లభించడం లేదంటూ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు..
మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా ఇలాంటి అసంతృప్తితో ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ కూడా వైయస్ కుటుంబానికి చాలా దగ్గరి వారు. జగన్ మొదటి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. శాసనమండలి రద్దు క్రమంలో మంత్రి పదవి వదులుకొని ఎంపీగా వెళ్లారు. ఇప్పుడు ఆయనను రేపల్లె ఇన్చార్జి నుంచి కూడా తప్పించారు. దీంతో అసంతృప్తితో ఉన్న మోపిదేవి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. మరో నేత కొలుసు పార్థసారథి కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్ననేత. కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇటీవల జగన్ తనను పట్టించుకోవడం లేదని.. జగన్ పట్టించుకోకపోయినా.. ప్రజలు పట్టించుకుంటున్నారని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొలుసు పార్థ సారథి కూడా కాంగ్రెస్ వైపు, షర్మిల చేరికవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా రెండు జిల్లాలలో పాత కాంగ్రెస్ లీడర్లు, వైసీపీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ లీడర్లు కాంగ్రెస్కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మరి షర్మిల కాంగ్రెస్ లో చేరితే.. ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటారా? ఆమెకు ఏపీసీసీ పదవి ఇస్తారా? లేక ఏదైనా జాతీయ పదవి ఇస్తారా? షర్మిల భవిష్యత్ రూట్ మ్యాప్ ఏంటి? వైసీపీకి దెబ్బపడుతుందా? టీడీపీ-జనసేన కూటమి ఓట్లు చీలతాయా? ఇనే ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లో తేలనుంది.