జగనన్న మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో జింఖానా గ్రౌండ్ లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్షకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతానన్న జగన్ హామీ సిఎం అయ్యాక ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర యువతను పూర్తిగా విస్మరించారని, రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన ఈ ప్రభుత్వం పై మండిపడ్డారు. యువత భవిష్యత్తు ను తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాశనం చేశారని, సిఎం జగన్ నిర్వాకం వలనే ఇవాళ బిజెవైఎం నేతలు ఆమరణ నిరాహారదీక్ష కు దిగారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కి రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంటే కనబడటం లేదా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. డిఎస్ సి లకు నోటిఫికేషన్ లు ఇవ్వలేదని, చదువుకున్న యువత వయో పరిమితి దాటి నిరుద్యోగంతో మగ్గుతున్నారని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం 6 లక్షల మంది కి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, నాలుగున్నరేళ్లలో 1345 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే వాటిని డైవర్ట్ చేయడానికే ఆడుదాం ఆంధ్రా అంటు ఆటలు ఆడుతున్నారు. కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూము లివ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వకపోవడం వలన ఆరు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. ముఖ్యమంత్రి వాళ్ల కుటుంబీకులకు, సన్నిహితులకు పదవులిస్తూ యువత జీవితాలతో ఆటలాడుతున్నారని, ప్రభుత్వం మెడలు వంచైనా జాబ్ క్యాలెండర్ సాధిస్తామని, ముఖ్యమంత్రి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆయన అన్నారు.
జగనన్నా..! మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ ?
121
previous post