సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమ క్షేత్రాన్ని మండలి బుద్ధ ప్రసాద్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, టీడీపీ నాయకులు పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలు, విగ్రహాలు, రోడ్డు పరిశీలించారు. ఈ సందర్బంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి అంటేనే సంగమ స్నానం అని ఈ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ నెల 24న మాఘ పౌర్ణమి స్నానాలు ఖచ్చితంగా సాగర సంగమంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా భక్తులకు సాగర సంగమానికి అనుమతి ఇవ్వలేదన్నారు. సాగర సంగమ ప్రాశస్థ్యం తెలిసి ఆది శంకరాచార్యులు ఇక్కడ స్నానం చేశారని, గంగానది కాకి రూపంలో వచ్చి స్నానం చేసి హంస రూపం పొందిందన్నారు. శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా భక్తులు మాఘ పౌర్ణమికి సాగర సంగమానికి వస్తారని, గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మాఘ పౌర్ణమి స్నానాలు సంగమ క్షేత్రంలోనే నిర్వహించాయని గుర్తు చేశారు. గత కృష్ణా పుష్కరాలకు వేలాది మంది ప్రతి రోజు సంగమ క్షేత్రంలో స్నానాలు చేశారని, ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా బాధ్యతగా నిర్వహించామన్నారు. సంగమ క్షేత్రంలో చంద్రబాబు పుష్కర స్నానం చేసి అభివృద్ధికి సహకరించారన్నారు. ఈ క్షేత్రంలో భక్తుల కోసం రెండు భవనాలు నిర్మించి దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. అటవీ శాఖ అధికారులు ఈ భవనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రభుత్వం దేవుళ్ళ విగ్రహాల నిర్వహణ పట్టించుకోలేదని బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి హిందూ మనోభావాలపై విశ్వాసం ఉంటే ఖచ్చితంగా సంగమ క్షేత్రంలో నిర్వహించాలన్నారు. జగన్మోహనరెడ్డికి హిందూ మనోభావాలపై విశ్వాసం ఉంటే తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు. లేకపోతే భక్తుల శాపాలతో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు.
హిందూ మనోభావాలు దెబ్బతీసేలా జగన్ పరిపాలన…
91
previous post