రాష్ట్ర ప్రజలను ఉచితాలు అనే మత్తులో ఉంచి పాలకులు పెత్తనం చెలాయిస్తున్నారని జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలే రాజులని వారే పాలన చేస్తారని జై భారత్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ తెలిపారు. కంకిపాడులో జై భారత్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు, పెనమలూరు నియోజకవర్గం జై భారత్ పార్టీ అభ్యర్థి లంక కరుణాకర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ప్రజలను బానిసలుగా చూస్తూ వారిని ఉచితల మత్తులో ముంచి పాలకులు రాజ్యాధికారం అనుభవిస్తున్నారని జై భారత్ పార్టీ అధికారంలోకీ వస్తే ప్రజలే పాలకమవుతారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సేవకులు అవుతారని అన్నారు. సంవత్సరంలో నాలుగు సార్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నియోజకవర్గ అభివృద్ధి ప్రజల చేతిలోనే ఉంటుందని వారే నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి కావాలి నిర్ణయించి పనులు చేపిస్తారని బిల్లులు కూడా ప్రజలే చెల్లిస్తారని తెలిపారు. గ్రామస్థాయి నుండి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని జెడి లక్ష్మీనారాయణ అన్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న బిజెపికి అనుకూలంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వారే కరువయ్యారన్నారు. పెనమలూరు నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా లంక కరుణాకర్ దాసును జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. తమ అభ్యర్థులు గెలిపించడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జెడి తెలిపారు.