తెలంగాణ(Telangana) మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy) కుమారుడు హర్ష రెడ్డి(Harsha Reddy)కి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపారు. కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ గడియారాల స్మగ్లింగ్ లో హర్ష రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలపై చెన్నై కస్టమ్స్ శాఖ ఈ సమన్లు జారీ చేసినట్టు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ 4న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు కోరగా, తాను డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నానని, ఇప్పుడు విచారణకు రాలేనని హర్ష రెడ్డి తెలిపినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు వస్తానని అతడు పేర్కొన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ వ్యవహారంపై హర్ష రెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడుతూ..ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఇది పూర్తిగా నిరాధారమైన అంశం అని, తనకు సమన్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని వెల్లడించాడు. ఫిబ్రవరి 5న చెన్నై కస్టమ్స్ అధికారులు ఓ స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు.
ఇది చదవండి: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్…
సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి నుంచి పటెక్ ఫిలిప్పే 5740, బ్రెగ్వెట్ 2759 లగ్జరీ వాచీలను చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు వాచీల విలువ మార్కెట్లో రూ.1.73 కోట్లు ఉంటుందని అంచనా. పటెక్ ఫిలిప్పే సంస్థకు భారత్ లో డీలర్షిప్ లేకపోగా, బ్రెగ్వెట్ వాచీలు భారత్ మార్కెట్లో అవుటాఫ్ స్టాక్ అని తెలుస్తోంది. ఈ రెండు వాచీలను హర్ష రెడ్డి విదేశాల నుంచి తెప్పించారన్నది కస్టమ్స్ అధికారుల అభియోగం. మహ్మద్ ముబీన్ నుంచి ఈ రెండు వాచీలను హర్ష రెడ్డి కొనుగోలు చేసేలా, అలోకం నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడని అధికార వర్గాలంటున్నాయి. నవీన్ కుమార్ ను కస్టమ్స్ అధికారులు మార్చి 12న విచారించగా… తాను హర్ష రెడ్డికి, ముబీన్ కు మధ్యవర్తిగా ఉన్నానని వెల్లడించినట్టు తెలిసింది. నవీన్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే చెన్నై కస్టమ్స్ అధికారులు హర్ష రెడ్డికి సమన్లు పంపినట్లు తెలుస్తుంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి