అంగన్వాడి ఉద్యోగుల ఆందోళనలకు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మద్దతు తెలియజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, గత 4 రోజులుగా అంగన్వాడి ఉద్యోగులు కందుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటూరి నాగేశ్వరరావు గురువారం మధ్యాహ్నం దీక్ష శిబిరానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద బలహీన వర్గాల చిన్నారులు ఎక్కువగా వెళ్లే అంగన్వాడీ కేంద్రాలలో, టీచర్లు, ఆయాలు, హెల్పర్లు చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అయినప్పటికీ వారి సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు అంగన్వాడీ సిబ్బందికి అధిక శాతం జీతాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత మాటలు చెప్పి వీళ్లందరి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తానన్న ముఖ్యమంత్రి, ఒక్కసారి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి అక్కచెల్లెమ్మలను మోసం చేశారని అన్నారు. 10 వేలు ఆదాయం దాటిన సిబ్బందికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని అన్నారు. జీతాలు, బిల్లులు సకాలంలో విడుదల చెయ్యలేని దీనస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని, పైగా ఇతర శాఖల ఉద్యోగులను కూడా వారిపై ఉసిగొలిపి రకరకాలుగా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది నిరసన తెలుపుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఉద్యోగుల చేత బలవంతంగా కేంద్రాలు తెరిపించిందని, ఇలా ఎన్నాళ్లు బెదిరిస్తారని ప్రశ్నించారు.
అంగన్వాడి ఉద్యోగుల ఆందోళనకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ డిమాండ్లన్నీ తప్పక పరిష్కరిస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నాయకులు చిలకపాటి మధుబాబు, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, షేక్ మున్నా, చుండూరి శీను, షేక్ రూబీ, షేక్ ఫిరోజ్, సయ్యద్ గౌస్ బాషా, సయ్యద్ అహ్మద్ భాష, పులి నాగరాజు, బద్దిపూడి శిఖామణి ఇతర నాయకులు పాల్గొన్నారు..