టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు అనుమతులు తీస్కుని మరికొందరు అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపి వందల కోట్లు సంపాదిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతి అనేదే లేకుండా అందరికీ ఇళ్ల స్థలాలను మట్టి ఫిల్లింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు నామ మాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఈ మట్టి తవ్వకాల వెనుక ఉండటంతో అధికారులేవ్వరు అక్రమ మట్టి తవ్వకాలవైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయడం లేదంటే అధికారులపై ఎలాంటి వొత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ హయాంలో మాజీమంత్రి చినరాజప్ప అనుచరులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు మట్టి తవ్వకాలు చేస్తే…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే తవ్వకాలు చెయ్యాలని అధికారులకు హుక్కుం జారీ చేయడంతో ఇతరులు ఎవ్వరు రామేశం మెట్టలో మట్టి తవ్వకాలు జరిపినా అధికారులతో దాడులు జరిపించి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో ద్వారంపూడి అనుచరులు కానీ వారు ఎవ్వరూ రామేశంమెట్టలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మెట్టలొ మట్టి తవ్వకాలు చేసేందుకు ద్వారంపూడి అనుచరులు ప్రయత్నించగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అడ్డుకున్నారు. నా పరిధిలో మట్టి తవ్వకాలు నా ఇష్టం ఇక్కడ తవ్వకాలు జరిపితే మర్యాదగా ఉండదని తెగేసి చెప్పడంతో ద్వారంపూడి చంటిబాబుపై కక్ష పెంచుకున్నారు. ఇందులో భాగంగానే జగ్గంపేటలో చంటిబాబును పక్కన పెట్టి నరసింహం కు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పదవి కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల రామేశంమెట్టలో మట్టి తవ్వకాలను పెద్దాపురంకు చెందిన కొందరు అడ్డుకున్నారు. మైనింగ్,రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి 13 టిప్పర్లు, 2ఎక్స్కవేటర్లు సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న ద్వారంపూడి సీజ్ చేశారు కదా ఫైన్ కట్టించుకుని వదిలేయండి అంటూ రుసరుసలాడుతూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్కడ సీజ్ చేసిన వాహనాలకు అక్కడే ఫైన్ వేసి వదిలేశారు. నాలుగున్నర ఏళ్లలో ఎప్పుడు లేనిది పెద్దాపురం వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు అడ్డుకోవడంతో ఖంగు తిన్న ద్వారంపూడి ఎలాగైనా మట్టి తవ్వకాలు తానే చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి అనుమతులు తీస్కుని తవ్వకాలు చేస్తే ఎలా అడ్డుకుంటారో చూస్తానని తన అనుచరుల వద్ద ద్వారంపూడి అనట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే మట్టి తవ్వకాలు అడ్డుకోవాల్సిన విపక్ష నేతలు మాత్రం రామేశం మెట్టకు వెళ్లకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం…