రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ కంచుకోట అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2019 జగన్ వేవ్ లో కూడా టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి గెలుపొందటమే ఉదాహరణగా చెప్పవచ్చు. 2,56,432 ఓటర్లు ఉన్నా ఈ నియోజకవర్గంలో బీసీలే అధికంగా ఉన్నారు. అదే అస్త్రంగా మలుచుకుంటు నియోజకవర్గానికి కంచుకోటగా మార్చుకున్నారు గోరంట్ల….టిడిపి పార్టీ ఏర్పాటు నుండి పార్టీలో కోనసాగుతూ అప్పట్లో ఎన్టీఆర్ కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు.
తొలిత రాజమండ్రి లో పోటీ చేసినప్పుటికి నియోజకవర్గాల పునర్విభజనలో రూరల్ లో పాగా వేశారు. అప్పటినుండి బలమైన నేతగా ఎదిగారు. ఒకానొక సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి రాక అలకపోని రాజీనామా వరకు వెళ్లిన పరిస్థితి. అయితే అధ్యక్షుడే రంగంలోకి దిగి బుజ్జగించడంతో వ్యవహారం సద్దుమణిగిందని చెబుతుంటారు. గోరంట్ల నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు కావడంతో అదే గాలి ప్రక్కన నియోజకవర్గం రాజమండ్రి కూడా తాకిందని సిటీ గెలుపుకు అదే కారణమని కొందరు చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో జనసేన టిడిపి పొత్తుతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సీటుకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు కేటాయిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచిచూడాలి.
జగన్ 175 నియోజకవర్గాలు టార్గెట్గా ఇన్చార్జుల మార్పులో భాగంగా ఈ నియోజకవర్గంలో బిసి సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణుకు కేటాయిస్తున్నారని ప్రచారం బలంగా వినిపిస్తుంది. అయితే బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని గెలుపుకు ఇదే అస్త్రంగా వైసిపి మార్చుకోబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసిపి పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన ఆకుల వీర్రాజును వైసిపి పార్టీ పక్కన పెట్టింది. చందన రమేష్ వారసత్వాన్ని పుచ్చుకున్న చందన నాగేశ్వర్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. గడపగడపకు తిరుగుతూ నాగేశ్వర్ జోష్ పెంచినప్పటికీ గ్రూప్ తగాదాలను తట్టుకోలేకపోతున్నాడని గుసగుసలు కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి గారికి ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాజమండ్రి రూరల్ కడియం మండలాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మంత్రిగారు ఏ మాత్రం ఎదుర్కొంటారో చూడాలంటూ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.