76
విశాఖపట్టణం జిల్లాలో ఓ తహసీల్దార్ అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను ఆయన నివాసం వద్దే దుండగులు హత్య చేశారు. కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, భూ సమస్యల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.