గెజిటెడ్ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. ఎవడ్రా నువ్వు ఏం తమాషాలు చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. ఇదీ అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆయన ఇలా చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ‘ఆంధ్రప్రదేశకు జగనే ఎందుకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కృష్ణాపురం, పాండ్రంగి తదితర గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాల ఫొటోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటూ మండల వైకాపా అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఎంపీడీవో విజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనకపోవడంతో వాటికి సంబంధించినవి అప్లోడ్ చేయలేదని ఎంపీడీవో సమాధానమిచ్చారు. దాంతో ఎమ్మెల్యే బహిరంగ సభ అని కూడా చూడకుండా అందరి ముందూ ఎంపీడీవో ను నోటికొచ్చినట్లు మాట్లాడారు! ఒక దశలో ఎంపీడీవోపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు వారించారు.
ఇటీవల పాండ్రంగిలో కార్యక్రమం రసాభాస కావడంతో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారన్నారు. తర్వాత సర్పంచి దాన్ని ఆవిష్కరించడంతో ఆ ఫొటోను సిటిజన్ అవుట్ రీచ్ యాప్లో అప్లోడ్ చేశామని, ఆ విషయం సభలో వివరిస్తుండగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహించారని చెప్పారు.