విద్యార్థులు నిత్యజీవితంలో తారసపడే విషయాలపై పరిశోధనా దృష్టిని అలవర్చుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్థానిక హిందూ ఫార్మసీ కళాశాల లో సిల్వర్ జూబ్లీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభకు కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు అధ్యక్షత వహించారు. త్రిపుర గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ విద్యార్థులు జీవితంలో వినియోగించే వస్తువులను దృష్టి కోణంతో చూడాలన్నారు. దీనికి ఉదాహరణగా తనకు ఎదురైన కొన్ని సందర్భాలను వివరించారు. అరటి బెరడులో మంచినీటిని తాగే అలవాటు కొన్ని ప్రాంతాల్లో ఉందని, అరటిబెరడు లో ఏ కెమికల్స్ ఆరోగ్యానికి సహకరిస్తున్నాయి పరిశోధించవచ్చన్నారు.
త్రిపురలో ప్రజలు గుమ్మడికాయ ఆకులతో బజ్జీలు, గుమ్మడికాయ కాడలతో కూరలు చేసుకుంటారని, దీని వెనుక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అలాగే అడవిలో మృగాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని చెట్ల మొదళ్లను తింటాయని, ఆ మొదళ్లలో ఉన్న ఔషధ గుణాలను గుర్తించి పరిశోధన చేయాలని చెప్పారు. ఇలా కనిపించే ప్రతి విషయంలోను ఫార్మసీ విద్యార్థులు దృష్టి పరిశోధన దృక్పథంతో ఉండాలన్నారు. ఫార్మసీ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
బల్క్ డ్రగ్స్ తయారీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికే తలమానికంగా ఉందని, ఈ రంగంలో ఫార్మసీ విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులను కళాశాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని యాజమాన్యానికి సూచించారు. 125 సంవత్సరాల క్రితం సంస్కృతం నేర్పించేందుకు ప్రారంభించిన హిందూ పాఠశాల ఈరోజు అన్ని విభాగాల కళాశాలలుగా అభివృద్ధి చెంది పేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మధుసూదన రావు, కళాశాల పూర్వ చైర్మన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీపతి పగడాల సాంబశివరావు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హిందూ ఫార్మసీ కళాశాలలో భూమి పూజ…
90
previous post