ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు సమావేశాలు ప్రారంభమైన సమయం నుంచి టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం అంటూ టీడీపీ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అయితే, టీడీపీ సభ్యుల నిరసన మధ్యనే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లులు ప్రవేశపెట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పలుసార్లు టీడీపీ సభ్యులకు సభలో సభా మర్యాదలు పాటించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోలేదు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్ వేశారు. దీంతో 10 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు స్పీకర్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, రామరాజు, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.