రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొక్కిరపాడు, వట్లూరు, రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలును, సీతారాంపురంలో దెబ్బతిన్న పంట పొలాలను, అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తూఫాన్ కారణంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామని, అయినప్పటికీ ఎంత మేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత రెండు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. కోత కోసిన ధాన్యాన్ని రైతుల కల్లాల నుండి నేరుగా ఆఫ్ లైన్ విధానంలో రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. తేమశాతం పై రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని రైస్ మిల్లర్లు కోరడం జరిగిందన్నారు. కోత కోయవలసిన పంట లో మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉందని, ఇందుకోసం ఫుడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో టెస్ట్ మిల్లింగ్ చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రంగుమారిన ధాన్యం, నూకశాతం పై రైతుకి, మిల్లర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా వున్న ప్రభుత్వం..
61
previous post