శ్రీకాళహస్తి నియోజక వర్గం మొదటి నుంచి రాజకీయ చైతన్యం కలిగినది. నాయకులే కాకుండా ఓటర్లు కూడా ఎంతో చైతన్యవంతులు. నాయకులకు పాఠం చెప్పడం, గుణపాఠం చెప్పడం కూడా ఓటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పేరు ఖరారైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, గోపాలకృష్ణారెడ్డి సానుభూతి ఆయనకు కలిసి వచ్చే అంశం. అంతమాత్రాన గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు. సొంత పార్టీలోని అసమతి నేతలను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా బిజెపి, జనసేన నాయకులతో కూడా సమన్వయం ఏర్పరచుకోవాలి.
పార్టీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ముని రామయ్య, ఎస్సీవి నాయుడు, టికెట్టు ఆశించి భంగ పడిన గాలి చలపతి నాయుడు, డాక్టర్ రాజేష్ లాంటి వారిని కలుపుకొని పోవాలి. 2019లో ఓడిపోయిన తర్వాత సుమారు మూడు సంవత్సరాలకు పైగా అందుబాటులో లేకుండా ఉండడం… ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోక పోవడం… పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించక పోవడం… కొందరి మాటలే నమ్మడం… ఇతరుల మాటలను లెక్కలోకి తీసుకోకపోవడం.. ఎక్కువకాలం హైదరాబాద్ కి పరిమితం కావటం లాంటి సంఘటనలు జరిగాయి.
ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం.. శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అనవసరంగా హంగామా చేసి తనతో పాటు అందరినీ కేసుల్లో ఇరికించడం… బెయిల్ కోసం కుటుంబాలకు దూరంగా ఉండటం లాంటి సంఘటనలతో కొందరు మనస్థాపానికి గురై ఉన్నారు. అటువంటి వారికి పూర్తిస్థాయి భరోసా ఇవ్వాల్సి ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం… పార్టీలో సముచిత స్థానం కల్పించడం లాంటి వాటిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది.