పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (KiranKumar reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డబ్బు సంపాదించడానికే పెద్దిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని.. అధికారం అడ్డం పెట్టుకుని తండ్రీ, కొడుకులు కోట్లు సంపాదించారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రొంపిచర్ల లోని చిన్న మసీదు నుంచి బస్టాండ్ వద్దనున్న పెద్ద మసీదు వరకు ఎన్నికల ప్రచారంలోనూ పుంగనూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా బాబుతో కలిసి కిరణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
కిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిన్న మసీదు వీధి నుంచి కొంత దూరం వీధిలైట్లు నిలిపేశారు. చీకట్లోనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు కిరణ్. అనంతరం రొంపిచర్ల బస్టాండ్ లో జరిగిన సభలో కిరణ్ మాట్లాడుతూ ఐదేళ్లలో పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలడా అంటూ సూటిగా ప్రశ్నించారు. పుంగనూరు నియోజకవర్గంలో రైతులను నట్టేట ముంచింది పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమేనన్నారు. అధిక పాల ధరలతో రైతులకు తీవ్ర అన్యాయం చేశారని.. కోట్ల రూపాయల అక్రమార్జనను సంపాదించారన్నారు.
ఇది చదవండి: వివాహ విందులో కత్తులతో దాడి..
పుంగనూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా బాబు కూడా పెద్దిరెడ్డి కుటుంబంపై ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిని ప్రశ్నించినందుకు తనపై 17 అక్రమ కేసులు పెట్టారని.. కేసులకు భయపడకుండా తాను ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పుంగనూరులో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చేసి చూపిస్తానన్నారు. గతంలో పుంగనూరులో ప్రశాంతంగా ఏ ఎన్నికలు జరగలేదని.. దౌర్జన్యాలతో ఓటర్లను భయపెట్టి పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా రానివ్వకుండా పెద్దిరెడ్డి కుటుంబం చేసింది అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా, ఎవరికీ భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి