తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం వెనకున్న ఉద్దేశం ఇదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో శాసన సభ సంప్రదాయాన్ని కాలరాసిందంటూ మండిపడ్డారు. సభలో సీనియర్లను పక్కన పెట్టి ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరగొద్దని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికయ్యాకే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
84
previous post