Vijaya Sankalpa Yatra :
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పై బీజేపీ జెండా ఎగరాలని విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి లు అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయిలో బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్ర శుక్రవారం సాయంత్రం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాగోల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మోదీ ప్రధానమంత్రి కాకముందు మన దేశం ప్రపంచ ఆర్ధిక వృద్దిలో 11వ స్థానంలో వుంటే, మోదీ పదేళ్ల పాలనలో దానిని 5వ స్థానానికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అంతేగాకుండా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచని అయోధ్య రామ మందిరం, 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని తనదైన శైలిలో చేసి చూపించారని తెలిపారు. నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలకు నిజమైన రాముడిలా, ఆరాధ్య దైవంగా మారారన్నారు. అలాగే పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చారని వారు గుర్తు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదన్నారు. ఇటీవల కేసీఆర్ పై వ్యతిరేకతతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటువేసి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు నిధులు లేకపోవడంతో రేవంత్ రెడ్డికి సిఎం పదవి ముళ్ల కిరీటంలా మారిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే 1.50 వేల కోట్లు అవసరం వుండగా, కేవలం రాష్ట్ర బడ్జెట్లో 60 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. ఇక కాంగ్రెస్ తో రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు.