అర్ధాంతరంగా నిలిచిపోయిన గుండ్లపల్లి – పొత్తూరు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు మళ్లీ మోక్షం లభించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి మేరకు ఈ రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల, రవాణా శాఖ కార్యదర్శి కె.శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గుండ్లపల్లి నుండి కొండాపూర్, గన్నేరువరం మీదుగా పొత్తూరు మీదుగా మొత్తం 21 కి.మీల మేరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులు కొనసాగనున్నాయి. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బెజ్జంకి, గన్నేరువరం మండలాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
వాస్తవానికి గుండ్లపల్లి-పొత్తూరు రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల విషయంలో అప్పటి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. నాటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అడ్డుకున్నారు… ఈ నేపథ్యంలో రూ.71 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైనప్పటికీ నిధులు విడుదల చేయకపోవడంతో అర్ధాంతరంగా రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. నిధుల విడుదల కోసం ఒత్తిడి తెచ్చినప్పటికీ డబ్బుల్లేవనే సాకుతో మంజూరు చేయలేదు.
ఈ విషయం బండి సంజయ్ ద్రుష్టికి రావడంతో స్థానిక ప్రజల డిమాండ్, ఆందోళనలను ద్రుష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖ రాశారు. అవసరమైతే సీఆర్ఐఎఫ్ కేంద్ర రహదారులు మౌలిక సదుపాయాల నిధి కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తానని అందులో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రోడ్డు పనులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశాక… సీఆర్ఐఎఫ్ కింద మళ్లీ ప్రతిపాదనలు పంపడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన సీఆర్ఐఎఫ్ నిధులను ఈ రోడ్డు విస్తరణ పనులకు మళ్లించాలని బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి చేయడంతో అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాాాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బండి సంజయ్ చొరవతో గన్నేరువరం, బెజ్జంకి మండలాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.