‘‘నేను నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్నా, ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతున్నా, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నా అయినా నన్ను ఓడించారు. దీనికి కారణమెవరో హిందువులంతా ఆలోచించాలని వచ్చే ఎన్నికల్లో హిందూ సంఘటిత శక్తిని చాటండి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలను కోరారు.
ఈరోజు కరీంనగర్ లోని వైశ్య భవన్ లో జరిగిన ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులుగా ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను నిస్వార్ధంగా పనిచేస్తున్నా,ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను అయినా నన్ను ఓడగట్టారు. దీనికి కారణమెవరో మీకు తెలుసు హిందూ సంఘటిత శక్తిగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాను. హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్లు ఆర్యవైశ్యులే మీరంతా నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాను. కానీ అధికారంలోకి రాలేకపోయాం. అయినప్పటికీ… రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆర్యవైశ్యుల్లో ఎంతో మంది పేదలున్నారు వారికి ఆర్దికంగా, విద్యాపరంగా చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అట్టడుగువర్గాలతోపాటు అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతి గురించి కూడా నిరంతరం ఆలోచించే ప్రభుత్వం మోదీదే. అందులో భాగంగానే అగ్ర కులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి అమలు చేస్తున్నారు.
బండి సంజయ్ చేతుల మీదుగా అన్నదానం :
భారత మాజీ ప్రధానమంత్రి, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్ లోని 59వ డివిజన్ లో ఆయన చిత్రపటానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని స్వయంగా తన చేతుల మీదుగా పేదలకు అన్నం వడ్డించారు.
మార్వాడీ యువ మంచ్ క్రికెట్ పోటీలను తిలకంచిన బండి సంజయ్ :
కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో మార్వాడీ యువ మంచ్ ఆధర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలను తిలకించారు. క్రికెట్ ఆటగాళ్లను వెన్ను తట్టి ప్రోత్సహించారు. యువతలో క్రీడా శక్తిని వెలికితీసేందుకు క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం యువకులతో కలిసి బండి సంజయ్ స్వయంగా కాసేపు క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచడం గమనార్హం. అనంతరం విజేతలకు స్వయంగా బహుమతులు ప్రదానం చేశారు.